చంద్రబాబులాగే జగన్ మా ప్రత్యర్థి: కిరణ్ కుమార్ రెడ్డి

7:00 AM 0 Comments


హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మాదిరిగానే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు తమ ప్రత్యర్థి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట చేపట్టిన ఆయన శుక్రవారం ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిన తర్వాత వైయస్ జగన్ పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడమనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయమని, అంత మాత్రాన రాజకీయ సంబంధాలు మారబోవని ఆయన అన్నారు.
చంద్రబాబు బిసి డిక్లరేషన్‌పై ప్రశ్నించగా, చంద్రబాబును ఎవరూ నమ్మబోరని, ఆ విషయాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని, ఎక్కువగా మాట్లాడాల్సిన పని కూడా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి తాను ఆశించింది కాదని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించారని, ముఖ్యమంత్రిగా ఎన్నాళ్లు ఉంటాననేది కూడా ముఖ్యం కాదని, ఉన్నంత కాలం ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేయడమే తన ఉద్దేశ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించడం తన బాధ్యత అని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ శాసనసభ, పార్లమెంటు సీట్లు గెలుచుకుని సోనియా తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా, లేదా పరిశీలించడానికి ఇందిరమ్మ బాట చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది పనికి వస్తుందని ఆయన అన్నారు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయని రీతిలో మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు నిర్దోషులుగా బయటపడతారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆబ్కారీ మంత్రి పార్థసారథి అంశం వేరని, పార్థసారథి కోర్టులోనే ఆ విషయం తేల్చుకుంటారని ఆయన అన్నారు. త్వరలో ఇంచార్జీ మంత్రులను మార్చనున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ల్లో ఒక కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వెలగవాడ వద్ద ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్‌లో ఒక కారును జాయింట్ కలెక్టర్ కారు ఢీ కొంది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందిరమ్మ బాట పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు సీఎం వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో సీఎం మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

0 comments:

Please give your valuable feedback about the news.